రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా లక్షా 15 వేల మొక్కలు నాటే లక్ష్యంతోపాటు.. మానేరు తీరాన 35 కిలోమీటర్ల మేర 53 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. శుక్రవారం మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.
గంభీరావుపేట మండలం నుంచి తంగళ్లపల్లి మండలం వరకు మొత్తం నాలుగు మండలాల్లోని 19 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద 53 వేల మొక్కలు నాటనున్నట్టు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, పదిర గ్రామాల మధ్యలో కొత్తగా అర్బన్ అటవీ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పదిర, పోతిరెడ్డిపల్లి రిజర్వు అటవీ బ్లాక్లో రెండు వందల ఎకరాల పరిధిలో అభివృద్ధి చేయనున్న పట్టణ అటవీ పార్క్ శంకుస్థాపన మంత్రులు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ అర్బన్ అటవీ పార్కులో కార్తీక వనం, రాశివనం, నవగ్రహ వనం, మెడిసినల్ గార్డెన్, పంచవతి, చిల్డ్రన్ ప్లే ఏరియా, ట్రెక్కింగ్ జోన్, హెర్బల్ గార్డెన్, వాచ్ టవర్, సైకిల్ ట్రాక్, ఓపెన్ జిమ్, యోగ ఏరియా, ట్రీ తో విజిటర్ జోన్లను మొదట ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం