తెలంగాణ ప్రభుత్వం అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలను ప్రవేశపెట్టింది. 2017లో అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13వేల వరకు నాలుగు విడతల్లో తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1500ల ప్రసవాలు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే రాష్ట్రంలోనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి అయిదో స్థానంలో నిలిచింది. సాధారణ ప్రసవాల సంఖ్య ఆసుపత్రిలో 50 శాతం వరకు పెరిగాయి.
కార్పొరేట్ సౌకర్యాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అన్ని పరికరాలు ఆసుపత్రిలో ఉన్నాయి. సిటిజి, మొబైల్ ఎక్స్‌రే, మల్టిపారమానిటర్, ఈసిజి, సెంట్రల్ ఆక్సిజన్, మెడికల్ ఐసీయూ, అల్ట్రాసౌండ్ యంత్రం, రక్తనిధి, నవజాత శిశు కేంద్రం, ఫొటోథెరఫీ, వార్మర్‌లు, సిరంజి పంపులు, ప్రసూతికి సంబంధించిన మందులు, శస్త్రచికిత్సకు రెండు ఏసీ థియేటర్‌లు ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నాయి. గైనకాలజిస్ట్ రెగ్యులర్ వైద్యురాలిని ఇటీవల మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఆసుపత్రికి బదిలీ చేయించారు.
ఫిజిషియన్, అనస్తిషీయా, గైనకాలజిస్ట్ జట్టుగా కార్పొరేట్ స్థాయిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలకు వైద్యులు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో హెల్ఫ్‌డెస్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌లు ఆసుపత్రిని సందర్శించిన సమయంలో హెల్ఫ్‌డెస్క్‌ను తప్పనిసరి ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అమలు కాలేదు.
నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం..
సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయి. ప్రస్తుతం ఒక జట్టుగా ఏర్పడి నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రసవాలు చేయడంలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి అయిదో స్థానంలో నిలిచింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌ల ప్రోత్సాహంతో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు చేశారు. కార్పొరేట్ స్థాయిలో సిరిసిల్ల ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తుంది. గర్భిణులు సిరిసిల్ల ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందుకోవాలి.
-మురళీధర్‌రావు, పర్యవేక్షకులు, జిల్లా ఆసుపత్రి
సిరిసిల్ల ఆసుపత్రిలో ప్రసవాలు... కేసీఆర్ కిట్:
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1500ల ప్రసవాలు జరిగాయి. 1289 మందికి కేసీఆర్ కిట్‌ను అందజేశారు. ఈ నెలలో సాధారణ ప్రసవాలు 50శాతానికి పైగా జరిగాయి.