కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం చిగురుటాకులా వణికిపోయింది. సరస్సును తలపించిన సిరిసిల్ల పట్టణం.. ఎన్నడూలేని విధంగా వరదలతో ఆగమైంది. ఎగువన ఉన్న పెద్దూరు, బోనాల, కొలనూరు తదితర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు అలుగులు పారటం వల్ల సిరిసిల్ల పట్టణంలోని దిగువన ఉన్న కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఫలితంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తాగునీరు, భోజనాలు లేక ప్రజలు పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడ్డారు.
ఈ వరదల కారణంగా ఓ గర్భిణీ తీవ్ర ఇబ్బందులకు గురైంది. కోనరావుపేట మండలం ధర్మారానికి చెందిన గర్భిణి నక్క శ్రావణి కుటుంబ సభ్యులతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి బయలుదేరింది. సిరిసిల్ల కొత్త చెరువు వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆటోలో ఆసుపత్రికి వెళ్లడం సాధ్యం కాదని అక్కడే ఆగిపోయారు. అటుగా వెళుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్.. గర్భిణీని గమనించారు. పోలీసులు, సిబ్బందిని సాయం చేయమని ఆదేశించారు. మోకాలు లోతు వేగంగా ప్రవహిస్తోన్న వరదలో సాయం పట్టినా... నడిచేందుకు శ్రావణికి వీలుపడలేదు. చేసేందుకు ఏమీ లేక.. అధికారులే స్వయంగా గర్భిణీని చేతులపై ఎత్తుకున్నారు. వరదలో అతి జాగ్రత్తగా.. వాహనం వరకు తీసుకొచ్చారు. సురక్షితంగా వాహనం వద్దకు చేర్చి... ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదీ చూడండి:
Rain Effect in Sircilla: చెరువులైన రహదారులు.. వరదలో కొట్టుకుపోయిన విగ్రహాలు