టీహబ్‌లోని ఎయిర్‌సర్వ్, పాలాడిన్ డ్రోన్స్ సంస్థల సహాయంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పెట్రోలింగ్ వాహనాలకు డ్రోన్లను అనుసంధానం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కోవడానికి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలకు డ్రోన్ల అనుసంధానం దేశంలోనే మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపయోగిస్తున్నట్టు ఆయన అన్నారు. ఇందు కోసం సెంట్రల్ కమాండ్, కంట్రోల్ సెంటర్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసి.. పూర్తి వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తెచ్చి..పెట్రో కార్స్ ఆఫీసర్లకు పెట్రో కార్స్, డ్రోన్ ఇస్తారు.
పెట్రోకార్, బ్లూకోట్ సిబ్బంది ఏయే ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందో.. ఆ ప్రాంతాలపైన డ్రోన్స్‌తో నిఘా పెడతారు. ఆ విజువల్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్, కంట్రోల్ సెంటర్లో డ్రోన్ లోకేషన్ కూడా చూపిస్తుంది. అంతేకాదు.. డయల్ 100 వ్యవస్థను కూడా డ్రోన్ ద్వారా ఆపరేట్ చేయనున్నారు. 100కు ఫోన్ రాగానే.. పోలీసుల కంటే ముందు అక్కడికి డ్రోన్ వెళ్తుంది. అక్కడి పరిస్థితి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో రికార్డు అవుతుంది. ఈ డ్రోన్లు కృత్రిమ మేధస్సుతో పని చేస్తాయి. ఇందులోని కంప్యూటర్ విజన్, మిషన్ లెర్నింగ్ గుంపులను పర్యవేక్షించడానికి, పోయిన వస్తువులను గుర్తించడానికి, సంఘటనలు గుర్తించడానికి డ్రోన్ ఆపరేటర్లను హెచ్చరించడానికి ఉపయోగపడుతాయి. లాక్డౌన్ నేపథ్యంలో పని లేకపోయినా.. రోడ్ల మీద తిరిగే వాహనాలను డ్రోన్ల ద్వారా గుర్తించి సీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు