సిరిసిల్లలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్‌లో వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అంతకుముందు వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే కాలంలో వరద సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వరద నివారణకు నిర్దిష్ట ప్రణాళిక
సిరిసిల్ల, వేములవాడలో వర్షపు నీరు ఎక్కడా కూడా నిల్వ ఉండకుండా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. రెండు పట్టణాల్లో వరద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వారం రోజుల్లో జిల్లాలో పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, నీటి పారుదల, మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయ, ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నీట మునిగిన సిరిసిల్ల
నైరుతి రుతుపవనాల ప్రభావంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rain Effect in Sircilla) ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నీటి మునిగింది. ఎడతెరిపిలేని వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. వరద నీటితో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ప్రగతినగర్, సాయినగర్.. అంబికానగర్, శాంతినగర్, గాంధీనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.