KTR Fires on Congress : ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు విపక్షాలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనాతో వృథా అయిపోయాయని అన్నారు. బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ ప్రసంగించారు.
KTR At Sircilla Public Meeting Today : బీడీ కార్మికులకు ఇంకా కొంతమందికి పింఛన్ రావాలని... అందరికీ వచ్చేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు వివరించారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని తెలిపారు. 65 సంవత్సరాల్లో హస్తం పార్టీ, బీజేపీ చేయని పనులను బీఆర్ఎస్ తొమ్మిదన్నరేళ్లలో పూర్తి చేసిందని కేటీఆర్ వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు - 6 నెలలకో సీఎం మారడం పక్కా : మంత్రి కేటీఆర్
Telangana Assembly Elections 2023 : రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy) అంటున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. గతంలో రూ.200 పింఛను ఇవ్వలేనివాళ్లు.. ఇప్పుడు రూ.2,000 ఇస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 11 ఛాన్సులు ఇచ్చారని.. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక ఛాన్సు అడుగుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ పెంచిన సిలిండర్ ధర తగ్గించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.3,000 ఇవ్వనున్నట్లు కేటీఆర్ వివరించారు.
"రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు దిల్లీ నేతల గుప్పిట్లో ఉంటారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో టికెట్లు, బీ ఫారాలు అన్ని దిల్లీలో నిర్ణయిస్తారు. కరోనాతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు నష్టం వచ్చింది. లక్ష కోట్లు నష్టం వచ్చినా పింఛన్లు, వేతనాలు, సంక్షేమ పథకాలు ఆగలేదు. వేములవాడలో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే నేను దత్తత తీసుకుంటాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల కోసం మహిళలు ఎగబడుతున్నారు." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చేయిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ధాన్యం దిగుబడిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. దిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని.. కేసీఆర్‌ను అణగదొక్కేందుకు దిల్లీ నేతలు ఏకమయ్యారని ఆరోపించారు. తమ ధైర్యం తెలంగాణ ప్రజలు అని.. బీఆర్ఎస్‌ను వారే కాపాడుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.