వస్త్రాలకు వన్నెలద్దిన పరిశ్రమలవి. రంగులతో కళకళలాడిన కార్ఖానాలవి. ఇప్పుడు రంగు వెలిసి పోయి.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ ఒక్క యంత్రమూ ఆడటం లేదు. ఈ పనినే నమ్ముకున్న కార్మికులు..ఇప్పుడు ఉపాధి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా సిరిసిల్ల అద్దకం పరిశ్రమ (sircilla dyeing industry)గురించే అంటే నమ్ముతారా..? వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి అద్దకం పరిశ్రమలు మూతబడ్డాయి. కొన్నిరోజులుగా రంగుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రాబడి మాత్రం ఎటూ చాలటం లేదు. ప్రభుత్వ సహకారమూ లేదు. చేసేదేమీ లేక పరిశ్రమను మూసి వేయటమే మేలు అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు యజమానులు.
15 వేలమంది కార్మికులపై ప్రభావం
ఈ పరిశ్రమ మూసివేతతో.. 2వేల మంది ఉపాధి కోల్పోయారు. 15 వేల మరమగ్గాల కార్మికులపై(weavers problems) ప్రభావం పడనుంది. నిజానికి నాణ్యమైన వస్త్రాలు తయారు చేయటంలో రాష్ట్రంలోని సిరిసిల్లపెట్టింది పేరు. దేశ నలుమూలలకూ ఇవి సరఫరా అవుతుంటాయి. వేలాది మందికి ఉపాధినిస్తోంది ఈ పరిశ్రమ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, కొత్తపల్లి, కమలాపూర్,గర్శకుర్తితో పాటు..సిరిసిల్ల కేంద్రంగా వస్త్రోత్పత్తి రంగంలో దాదాపు 50 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో అద్దకం పరిశ్రమ కార్మికులను నిత్యం కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేక చాలీచాలని కూలీతో ఇబ్బందులు పడుతున్నారు.
మూతపడుతున్న పరిశ్రమలు
సిరిసిల్ల చుట్టు పక్కల గ్రామాల కార్మికులతోపాటు పొరుగున ఉండే మెదక్, నిజామాబాద్, జిల్లాల్లోని వ్యవసాయ కూలీలూ ఈ అద్దకం పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి దొరకని వారంతా సిరిసిల్ల, కరీంనగర్ అద్దకం పరిశ్రమలోనే పని చేసుకుంటు న్నారు. కాస్తో కూస్తో వెనకేసుకుందాం అనుకుంటే అసలు రోజు గడవటమే కష్టమైపోయే దుస్థితికి వచ్చారు వీరంతా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 300 వరకు అద్దకం పరిశ్రమలు ఉండేవి. కాలానుగుణంగా అవి 60కి పడిపోయాయి. మూడు నెలల నుంచి రంగుల ధరలు పెరిగిపోయి పూర్తిగా నష్టం వాటిల్లుతుండడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా(dyeing industry problems in sircilla) నుంచి మూసివేశారు. ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాగే సుమారు 15 వేల మంది మరమగ్గాల, పెట్టికోట్స్ కుట్టే, సైజింగ్ కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది.
దెబ్బతిన్న యూనిట్లు
సిరిసిల్లలో(sircilla dyeing industry problems) 40 వేల మరమగ్గాలు ఉండగా ఇందులో నాలుగు సంవత్సరాల క్రితం వరకు 15 వేలకు పైగా మరమగ్గాలపైన కాటన్ ఉత్పత్తి జరిగేది. ఆ సమయంలో 300కు పైగా డైయింగ్ యూనిట్లలో అద్దకం పని సాగేది. తరచూ కాటన్ నూలు ధరల హెచ్చు తగ్గులతో పాటు పని కూడా కష్టతరంగా మారడం వల్ల పవర్‌లూం యజమానులు కాటన్ నుంచి పాలిస్టర్ బట్ట ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. ఫలితంగా ప్రస్తుతం 36 వేల వరకు మరమగ్గాలపై పాలిస్టర్ ఉత్పత్తి జరిగితే 4 వేల మర మగ్గాలపై కాటన్ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రభావంతో డైయింగ్ యూనిట్లు కూడా దెబ్బ తిన్నాయి. ప్రస్తుతానికి 40 యూనిట్లలో మాత్రమే అద్దకం జరుగుతోంది. గతంలో రోజు 3 లక్షల మీటర్ల వరకు అద్దకం జరిగే బట్ట ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది.
ఇతర రాష్ట్రాల నుంచి పెరిగిన పోటీ
కాటన్ బట్టను వివిధ రంగుల్లో అద్ది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. గతంలో సిరిసిల్ల అద్దకం పరిశ్రమను కుటీర పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించి కొన్ని రాయితీలను కల్పించింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, గుజరాత్ రాష్ట్రంలోని అద్దకం పరిశ్రమలకు రాయితీలు(dyeing industry in other states)లేకపోవడం వల్ల అక్కడి పరిశ్రమలు కేస్‌మెట్ బట్ట తయారీపై అసక్తి చూపలేదు. సిరిసిల్ల పరిశ్రమపైనే ఆయా రాష్ట్రాలు అధారపడ్డాయి. కార్మికులకు ఉపాధి కూడా లభించింది. రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అద్దకం పరిశ్రమను అన్ని రాష్ట్రాల్లో కుటీర పరిశ్రమగానే గుర్తించింది. ఫలితంగా తమిళనాడులోని పలు ప్రాంతాలు సహా, రాజస్థాన్‌లోని బలహోత్రలో ఆధునిక డైయింగ్ యూనిట్లు ఏర్పడ్డాయి. ఈ కారణంగా సిరిసిల్ల అద్దకం పరిశ్రమకు పోటీ ఏర్పడింది.
పెరిగిన రంగుల ధరలు.. అదనపు భారం
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు కాటన్ వస్త్రమే అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది. దీని అనుబంధంగా అద్దకం పరిశ్రమ కూడా కళకళలాడుతూ ఉండేది. చీరలు నేసి రంగలు అద్ది ఆరబెడితే 'ఇంద్రధనస్సు'భూమిపై పరిచిన చందంగా పరిశ్రమ పరిసరాలు కనిపించేవి. ఇప్పుడా వన్నె తగ్గిపోయింది. కారణం.. వస్త్ర పరిశ్రమలో యజమానులు పాలిస్టర్ ఉత్పత్తివైపు మొగ్గుచూపుతూ వచ్చారు. కాటన్ వస్త్రం ఉత్పత్తిని ఆధారం చేసుకుని అనుబంధంగా ఉన్న అద్దకం యూనిట్లు కాస్తా 40కు చేరాయి. అద్దకానికి ఉపయోగించే రంగుల ధరలూ విపరీతంగా పెరిగాయి. 2 వేలు ఉన్న రంగు ధర 4 వేల 500లకు చేరుకుంది. రంగులద్దిన వస్త్రానికి మీటరుకు 6 రూపాయల 25 పైసలు ఖర్చవుతుండగా వస్త్ర వ్యాపారులు 4 రూపాయల 25 పైసలు చెల్లిస్తున్నారు. తమపై మీటరుకు 2 రూపాయల భారం పడుతోందని అద్దకం పరిశ్రమ యజమానులు అంటున్నారు.
కనుమరుగైన పెట్టికోట్స్ తయారీ
ఒకప్పుడు ఈ పరిశ్రమలో 5 వేల మంది వరకు కార్మికులు పని చేశారు. ఉత్పత్తి అయిన వస్త్రాలతో పెట్టికోట్స్ తయారు చేసేవారు. వాటిని కుడుతూ సుమారుగా మరో 2వేల మందికిపైగా మహిళా కార్మికులు ఉపాధి పొందేవారు. ఇప్పుడు పెట్టికోట్స్ తయారీయే కనుమరుగైంది. అద్దకం పరిశ్రమలో ప్రస్తుతం 300 మంది మాత్రమే ఉన్నారు. క్రమేణా డైయింగ్ యూనిట్లు మూతపడటం వల్ల కొందరు కార్మికులు ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని పోషించుకోలేక ఈ నాలుగేళ్లలో 12 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరవైంది
అద్దకం పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహకాలూ లేకపోవడమే ఈ సమస్యలకు కారణమన్న వాదన వినిపిస్తోంది. కార్మికులు, యజమానులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కనీసం అధ్యయనం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించింది. సిరిసిల్లలోని మరమగ్గాలపై ఎక్కువగా బతుకమ్మ చీరలే ఉత్పత్తి అవుతున్నాయి. బతుకమ్మ చీరల ఆర్డర్లతో కాటన్ వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. వీటికి తోడు పెరిగిన రసాయన ధరలూ డైయింగ్ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నాయి. జీఎస్టీ విధించడం వల్ల ధరల నియంత్రణ ఉండటం లేదు.
రాయితీలు కల్పించాలి
సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి ఆడపడుచులకు చీరలను కానుకగా ఇస్తోంది. మరమగ్గాల కార్మికులను ఆదుకున్న విధంగానే ధోతుల జోడా, లుంగీలు, కాటన్ సంచులు లాంటి ఆర్డర్లు సిరిసిల్లకు అందిస్తే అద్దకం పరిశ్రమ నిలదొక్కుకుంటోందని సైజింగ్, డైయింగ్ పరిశ్రమ యజమానులు అంటున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించటం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీఎస్టీ మినహాయింపు, ఆధునిక యంత్రాలు, రంగులు, రసాయనాలపై సబ్సిడీ లాంటివి అందిస్తే డైయింగ్ పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని పలువురు సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఉపాధి అన్వేషణ
ఎన్నో ప్రతికూలతలు, కరోనా వంటి విపత్తులు.. చేనేత కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఆ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న వారిని మరో ఉపాధి వెతుక్కునే పరిస్థితులు కల్పిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 16 వేల మంది, ఏపీలో 29 వేల మంది కార్మికులు చేనేత నుంచి మరమగ్గాల రంగంలోకి మారారు. క్రమంగా అద్దకం పరిశ్రమ కార్మికులూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే అద్దకం పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.
రంగుల రసాయనాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల గిట్టుబాటు కావడం లేదు. అందువల్ల డైయింగ్ పరిశ్రమ మూసేయాల్సిన పరిస్థతి వచ్చింది. మా కార్మికులు దాదాపు 5 నుంచి 6 వేల మంది రోడ్డున పడాల్సి వస్తోంది. - దేవదాసు, సిరిసిల్ల
రంగులు ధరలు పెరగడం వల్ల బంద్ పెట్టినం. ప్రస్తుతం ముడిసరకులు రేట్లు పెరిగినాయి. సిరిసిల్లలో ఇప్పటికే బంద్ పెట్టినాము. భివండి, తమిళనాడులో ఇప్పటికే చాలా వరకు పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రభుత్వం మా గురించి ఆలోచించి సబ్సీడీ ఇవ్వాలని కోరుతున్నాం. -మహేందర్, కరీంనగర్
ఇదీ చూడండి: