రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. సన్నవరికి మద్దతు ధర చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడికి యత్నంచిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు.
ప్రభుత్వ ఆదేశాలతో సన్నవరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని...ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై పోలీసులు, అధికారులు దురుసుగా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాసులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.