వివక్షను చూసిన చోటే విజయాలు సాధిస్తున్నామని... అబ్బురపరిచేలా కాళేశ్వర జలాలతో సాగు, తాగునీటి ఫలాల్ని అందుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర ఆలయం, మధ్యమానేరు జలాశయాన్ని సోమవారం సందర్శించారు. మూలవాగు, మధ్యమానేరు నీళ్లు కలిసే చోట వంతెనపై నుంచి చూసిన సీఎం తన్మయత్వం చెందారు.
గుర్తుకొస్తున్నాయి
రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కాళేశ్వరం జలాలు మధ్యమానేరుకు తరలి వచ్చిన తర్వాత తొలిసారి పర్యటించిన సీఎం... వేములవాడ, మధ్య మానేరు పర్యటనల్లో పలుమార్లు గత స్మృతులు, చేదు అనుభవాలు గుర్తు చేసుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. దేవాలయమంతా కలియతిరిగి సాంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించారు. రాజరాజేశ్వరస్వామికి రెండు కోడెలు సమర్పించారు.
రాజన్న ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర ప్రజలు ఇలవేల్పుగా కొలిచే వేములవాడ రాజన్న ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. ఐదారు ఎకరాల్లో ప్రధాన దేవాలయాన్ని, మొత్తం 35 ఎకరాల్లో ప్రాంగణమంతా అన్ని హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. సకల సౌకర్యాలతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకునేటట్లు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. 2020-21 బడ్జెట్‌లో వేములవాడ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామన్నారు.
సమైక్య పాలనలో నిర్లక్ష్యం
మధ్య మానేరు రిజర్వాయర్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్.. మధ్యమానేరు ద్వారా దాదాపు 70 నుంచి 80 శాతం రాష్ట్రానికి తాగునీరు అందుతుందని వెల్లడించారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఈ ప్రాంతమంతా ఎడారిని తలపించేదన్న సీఎం... ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందని మూలవాగుకుపైన నిమ్మపల్లి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఆపారని అన్నారు. మధ్యమానేరు ప్రధాన డ్యామ్ గేట్ల వద్ద గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. జలహారతి ఇచ్చారు.
చాలా సంతోషంగా ఉంది
విమర్శలు చేసే నాయకులకు నీటి పారుదలపై కనీస పరిజ్ఞానం కూడా లేదని సీఎం దుయ్యబట్టారు. ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించినట్లుగానే నీటిపారుదల రంగంలోనూ మొదటి ఫలితం కరీంనగర్‌కు దక్కడం సంతోషంగా ఉందని పునరుద్ఘాటించారు. స్వయంగా చూడాలనుకునే ఇక్కడికి వచ్చానన్న కేసీఆర్.. హృదయం నిండుగా సంతోషంగా వెళుతున్నట్లు పేర్కొన్నారు.