Handloom workers Strike : అయిదేళ్లుగా పెరగని కూలీరేట్లు, మూడేళ్లుగా రాయితీలు లభించని పరిస్థితులు.. వెరసి సిరిసిల్లలో పాలిస్టర్, బతుకమ్మ చీరల ఉత్పత్తి నిలిచిపోయింది. కూలీరేట్లకు తోడు నూలు, డాబీలు, పింజర్ల రాయితీ మంజూరు కాకపోవటం.. వాటి పరంగా అధికారులు, యాజమాన్యాల నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. రెండ్రోజులుగా ఆసాములు, కార్మికులకే పరిమితమైన సమ్మె క్రమంగా పలు కార్మిక సంఘాల మద్దతుతో అనుబంధ రంగాలకూ విస్తరించింది.
మాటల్లోనే.. అమల్లో కాదు:
మూడంచెల వ్యవస్థలోని సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో నూలుధరల పెరుగుదల, చీరల డిజైన్ల పెంపుతో ఆసాములకు అదనపు పెట్టుబడి, కార్మికులకు శ్రమ పెరిగింది. చీరల ఉత్పత్తికి అయ్యే వ్యయానికి, టెస్కో సేకరించే ధరలకు నడుమ పొంతన లేదు. పలుమార్లు జౌళిశాఖ అధికారులు యజమానులు, ఆసాములతో జరిపిన చర్చల్లో సయోధ్య కుదరలేదు. డాబీలు, పింజర్లు అమర్చినందుకు అయిన పెట్టుబడికి, వాటిపై ఉత్పత్తి చేసిన చీరలకు మీటరుకు రూ.1.50 వంతున చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచలేదు.
ఐదేళ్లుగా దాటవేస్తూ:
పాలిస్టర్ వస్త్రోత్పత్తిలో ప్రతి రెండేళ్లకోసారి కూలీని పెంచాలి. 2018లో పెంచిన కూలీ రేట్లు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. నూలు, యంత్ర సామగ్రి ధరలు పెరగడంతో కూలీరేట్లు పెంచడం సాధ్యం కాదంటూ అయిదేళ్లుగా యజమానులు దాటవేస్తూ వస్తున్నారు.
14వేల మరమగ్గాలు మూలకు:
బతుకమ్మ చీరల ఉత్పత్తిలో కార్మికుల కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వం 10శాతం నూలు రాయితీ ప్రకటించింది. 2018 సంవత్సరానికి 4,121 మంది కార్మికులకు రూ.6.69 కోట్లు పంపిణీ చేశారు. తర్వాత మూడేళ్లగా రాయితీ అందలేదు. ఇలాంటివన్నీ కార్మికుల ఆందోళనకు కారణాలవుతున్నాయి. సమ్మెలో భాగంగా ప్రస్తుతం పరిశ్రమలోని 14వేల మరమగ్గాలు బతుకమ్మ చీరల ఉత్పత్తిని నిలిపివేశాయి.