రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ బీసీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు ఈరవేణి ఎల్లవ్వ, బాబులది పేద కుటుంబం. వారి కుమారుడు యాదయ్య... కామారెడ్డి జిల్లాలో 2013 అక్టోబరు 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి... మానసిక దివ్యాంగుడనే (మెదడుకు సంబంధించిన వ్యాధి) కారణంతో కనీసం నడవలేని సాత్విక్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. వృద్ధురాలి భర్త బాబు అనారోగ్యంతో 2020 జూన్‌లో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆ దివ్యాంగ బాలుడి సంరక్షణ భారం ఎల్లవ్వపైనే పడింది. ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షలు అప్పుచేసి బాలుడి వైద్యానికి వెచ్చించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.
దయ చూపండి..
సాత్విక్‌కు ప్రతి నెలా వచ్చే దివ్యాంగ పింఛన్‌తో ఇల్లు నెట్టుకొస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ బాలుడికి ఖరీదైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా చిన్నారిని ఆసుపత్రిలో చూపించాల్సి ఉంటుందని వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. తనకు వితంతు పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారి సాత్విక్‌కు మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని, దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటోంది.
ఇదీ చూడండి: డబ్బా మూత మింగిన చిన్నారి.. కాపాడిన వైద్యులు