అక్షయపాత్ర వద్ద బారులు తీరిన అన్నార్థులు కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్థాకలితో కుటుంబాన్ని పోషించుకునే కార్మికులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సహకారంతో మున్సిపల్ శాఖ, అక్షయపాత్ర ఫౌండేషన్ సంయుక్తంగా 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేశారు. రోజూ 500 మందికి పైగా కడుపు నింపుకుంటున్నారు. చేనేత కార్మికులతో పాటు, వివిధ పనులపై పట్టణానికి వచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన ఏర్పాటుపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పట్టణంలో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.