గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులపై సర్కార్ ఒత్తిడి పెంచింది. పట్టణాలు, నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని సూచిస్తుండటంతో పలు గ్రామాలు అభివృద్దివైపు పరుగులు తీస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లో నిధుల కొరత కారణంగా పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మడక గ్రామం అభివృద్దిలో ముందుకు దూసుకెళుతోంది. ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న ప్రకృతి వనం అందరిని ఆకర్షిస్తోంది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కనిపించే పార్కు..... గ్రామంలోనూ రూపుదిద్దుకుంటోంది.
సంపద సృష్టించుకుంటున్నారు
గ్రామంలోని ప్రజలు సేదతీరేలా పార్కును తీర్చిదిద్దుతున్నారు. వానర వనం చిట్టడివిలా మారుతోంది. దాదాపు 30ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్నిరకాల పళ్ల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్తను సంపదగా మార్చేలా డంపింగ్ యార్డు నెలకొల్పారు. తడి పొడి చెత్తను వేరు చేయడంతోపాటు ఇతర వ్యర్థాలను తొలగించి పూర్తి స్థాయిలో ఎరువులను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పనులన్నింటినీ ఉపాధి హామీ నిధులతోనే చేపడుతుండటంతో తమకు ఉపాధి లభిస్తోందని మహిళలు చెబుతున్నారు.
పనులు చెయ్యమని చెబుతున్న ప్రభుత్వం... పైసలివ్వడం లేదు
ప్రభుత్వం అభివృద్ధి గురించి ఒత్తిడి చేయడం బాగున్నా... అవసరమైన నిధులకు మాత్రం ఇబ్బంది కలుగుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధి కాంక్ష ఉన్న తాము పనులు చేపట్టడం కోసం విరాళాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం పనులు చేపడితే నిధులు సరిపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో తమ గ్రామం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేసినా... నీరు, కరెంటు సదుపాయం లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పెండింగ్లోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులంన్నింటినీ పరిష్కరించాలి'