పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద వామన్రావు దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని భాజపా న్యాయ విభాగం పరిశీలించింది. అనంతరం మంథనికి చేరుకొని ప్రధాన చౌరస్తా వద్ద మానవహారంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. సుమారు గంట పాటు ఆందోళన నిర్వహించారు. వామన్రావు దంపతుల స్వగ్రామమైన గుంజపడుగు చేరుకొని, గుంజపడుగు బస్టాండ్ నుంచి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు.
వామన్రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. హత్యలపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వామన్ రావు తమ్ముడు ఇంద్రశేఖర్ న్యాయవాదులతో జరిగిన విషయాలన్నీ వివరించారు. న్యాయవాద దంపతుల హత్యల వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని భాజపా లీగల్ సెక్రటరీ జయశ్రీ ఆరోపించారు. హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హత్యలో ప్రమేయం ఉన్న వారందరూ బయటికి రావాలంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు దోషులను ఎన్కౌంటర్ చేయకుండా ఉండాలని వారు డిమాండ్ చేశారు. వీరి వెంట పెద్దపల్లి జిల్లా భాజపా అధ్యక్షుడు సోమరపు సత్యనారాయణ ఉన్నారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి