వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువన కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగింది. రెండ్రోజులుగా నీటిపారుదల అధికారులు ప్రాజెక్టు 8 గేట్లను రెండు మీటర్ల ఎత్తు పైకి లేపి 83,470 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లుండగా ప్రస్తుతం 147.66 మీటర్ల మేరకు నీరు చేరింది. 20 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో ప్రస్తుతం 19.2307 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 98,826 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 83,470 క్యూసెక్కులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు