మాస్కులు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని పెద్దపల్లి జిల్లా మంథని సీఐ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
ప్రతి గ్రామంలో వాణిజ్య సముదాయాల ముందు అవగాహన కల్పించే విధంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. మాస్కు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెయ్యి రూపాయల జరిమానా, కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలి..
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సీఐ సూచించారు. బస్టాండ్లు, కూడళ్లలో అవగాహన కల్పించేలా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటించాలని.. యువత గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి ఇద్దరు కానిస్టేబుళ్లు..
ప్రతి గ్రామానికి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి పరిశీలిస్తారని మంథని సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతను విస్మరిస్తే మళ్లీ లాక్ డౌన్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం దాతల సహకారించాలని కోరారు. నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కరోనాను అరికట్టి మంథని మండలాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు సీఐ సూచించారు.