పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లిలో పరమేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకర్ ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు సమకూరుస్తుందని మధుకర్ పేర్కొన్నారు.
ఆయన రైతుల పక్షపాతి..
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, అన్నదాతలు నష్టపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యవసాయ విధానాల్లో మార్పులు చేస్తూ రైతన్న ముఖంలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.
వారిని ఇబ్బందులకు గురిచేయొద్దు..
ప్రస్తుత సంవత్సరంలో అధిక వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు. రైతులు కూడా నిదానంగా అధికారులు సూచించిన సమయాల్లోనే పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని కోరారు.
మిల్లులో ఉద్యోగాలు స్థానికులకే..
మిల్లులో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గొల్లపల్లి గ్రామస్తులు జడ్పీ ఛైర్మన్‌ను కోరారు. ఫలితంగా నిరుద్యోగులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. మరోవైపు మిల్లు వల్ల ఏర్పడే దుమ్ము ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జడ్పీ దృష్టికి తీసుకెళ్లారు.