Annaram Pump House Renovated: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని అన్నారం పంపుహౌసు పునరుద్ధరణ పూర్తయింది. మొదటి పంపు నుంచి శనివారం విజయవంతంగా నీటిని ఎత్తిపోశారు. ఈ ఏడాది జులైలో గోదావరి నదికి వచ్చిన భారీ వరదలకు ఈ పంపుహౌసులోకి నీరు చేరి మోటార్లు మునిగిపోయాయి. వరద తగ్గుముఖం పట్టాక నీటి తోడివేత, పంపుల మరమ్మతులను చేపట్టారు. అక్టోబరులో అన్నారం పంపుహౌసు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తామంటూ సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఆ మేరకు నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ వారు పనులు పూర్తి చేశారు.
అన్ని పంపుల నుంచి ఎత్తిపోతలకు కార్యాచరణ..: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద అన్నారం పంపుహౌసు ఉంది. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి అన్నారం (సరస్వతి) బ్యారేజీలోకి ఎత్తిపోసే నీటిని అన్నారం పంపుహౌసు ద్వారా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలోకి ఎత్తిపోస్తారు. దీనికోసం 12 పంపులతో పంపుహౌసు నిర్మించారు. రెండు నెలల క్రితం వచ్చిన భారీ వరదల్లో పంపుహౌసు మునిగిపోయింది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ మోటార్లు ఏర్పాటు చేసి వరద నీటిని తోడిపోశారు. కంట్రోల్ రూం, ప్యానల్స్‌ను సిద్ధం చేశారు. మోటార్లన్నింటినీ పంపుల నుంచి విడదీసి ఆరబెట్టారు. ప్రస్తుతం ఒక పంపు సిద్ధం కాగా.. ఒక్కోటి చొప్పున అన్నీ సిద్ధం చేస్తున్నట్లు ఇంజినీర్లు ప్రకటించారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో కన్నేపల్లి వద్ద ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మొదటి పంపుహౌసు పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి పంపులను తిప్పేందుకు వేగంగా పనులు నిర్వహిస్తున్నారు.
ఇదే స్ఫూర్తితో మిగిలిన పంపులను నడిపించాలి..: ప్రభుత్వం శాసనసభ ద్వారా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నారం పంపుహౌసులో మొదటి పంపును విజయవంతంగా నడిపినట్లు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎన్‌సీ మురళీధర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్న ప్రకారం రెండు నెలల కాలంలోనే పునరుద్ధరణ పూర్తి చేసినందుకు పెంటారెడ్డి, నల్లా వెంకటేశ్వర్లులను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పంపులను కూడా నడిపించాలని కోరారు. కన్నేపల్లి పంపుహౌసు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని నీటిపారుదల శాఖ ప్రకటించింది.
ఇవీ చూడండి..
మరిన్ని ఆస్తులను విక్రయించనున్న ప్రభుత్వం.. ఫ్లాట్లు, స్థలాల అమ్మకానికి రంగం సిద్ధం
2024 లక్ష్యంతో భాజపా 'ఆపరేషన్ 144'.. 'పక్కా లోకల్' స్కెచ్‌తో రంగంలోకి మోదీ!