వీధి వ్యాపారులకు నామమాత్రపు వడ్డీతో రుణ సాయం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించడంలోనే ఆది నుంచి నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొంత మేరకు ఊపందుకున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా పట్టణ ఉన్నతాధికారులతో మెప్మా అధికారులు సమీక్షిస్తూ మరింత వేగవంతం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు.
ఈ మేరకు గత వారం రోజులుగా కొంత పురోగతి సాధించినట్లవుతోంది. ఆయా నగరాలు, పట్టణాల్లోని జనాభాలో 5 శాతం వీధి వ్యాపారులు ఉంటారని ప్రభుత్వం అంచనాలు వేసి ఆయా లక్ష్యాలను విధించింది. అత్యధిక చోట్ల ఇప్పటివరకు కేవలం జనాభాలో 2 నుంచి 3 శాతం వీధి వ్యాపారులను మాత్రమే గుర్తించగా కొన్ని పురపాలికలు దాదాపుగా 1 శాతానికే పరిమితమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని రాయికల్ పురపాలికలో ఇటీవల వరకు 2.88 శాతం వీధి వ్యాపారులను గుర్తించగా అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పురపాలికలో కేవలం 1.1 శాతం మాత్రమే గుర్తించారు. గుర్తించిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలోనూ పురపాలికలు వెనుకబడ్డాయి.
పెరిగిన లక్ష్యం... సర్వేలో నిమగ్నం
గతంలో జనాభాలో 2 శాతం వీధి వ్యాపారులుంటారనే లక్ష్యంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ లక్ష్యాలను విధించింది. ఆ ప్రకారంగా స్వశక్తి సంఘాల ఆర్పీలు, సామాజిక కార్యకర్తలు సర్వేతో పాటు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. చాలా పట్టణాలు, నగరాల్లో లక్ష్యానికంటే తక్కువగానే గుర్తించారు. తాజాగా జనాభాలో 5 శాతం వీధి వ్యాపారులుంటారంటూ ప్రభుత్వం లక్ష్యాలను పెంచింది. దీంతో మరోసారి ఆర్పీలు, సామాజిక కార్యకర్తలు సర్వేలో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నగరపాలికతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాదు పురపాలికల్లో కలిపి మొత్తం 3,16,159 జనాభా కాగా ఇందులో 5 శాతం మొత్తం 15,808 మంది వీధి వ్యాపారుల గుర్తింపు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6,711 మందిని మాత్రమే గుర్తించగా మొత్తం మీద 2.14 శాతం వీధి వ్యాపారులను మాత్రమే గుర్తించారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 9,037 మందిని గుర్తించాల్సి ఉండడంతో ఆయా పట్టణాల్లో స్వశక్తి ఆర్పీలు, సామాజిక కార్యకర్తలు వీధి వ్యాపారుల గుర్తింపు, ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో నిమగ్నమయ్యారు.
గుర్తించే విధానమిదీ :
క్షేత్రస్థాయిలో స్వశక్తి సంఘాల ఆర్పీలు ఆయా పట్టణాల్లోని వ్యాపార కేంద్రాలతో పాటు కాలనీల్లో పర్యటిస్తూ వీధి వ్యాపారులను గుర్తించి అక్కడికక్కడే ‘తెలంగాణ అర్బన్ స్ట్రీట్ వెండర్స్ సర్వే’ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. దీని ప్రకారం ఆయా పట్టణ కార్యాలయాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సామాజిక కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఒక్కొక్కరికి వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికెటు తయారు చేస్తారు. లబ్ధిదారు ఇచ్చిన చరవాణి నంబరకు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని తిరిగి సామాజిక కార్యకర్తలకు చెప్పగానే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో సమగ్ర వివరాలను పూరించి ఆన్‌లైన్‌లోనే బ్యాంకులకు సిఫారసు చేస్తారు. ఆయా బ్యాంకు అధికారులు వీరి వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించి రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఆధార్ కార్డులకు మొబైల్ నంబర్లు అనుసంధానం లేకపోవడంతోనే నమోదులో జాప్యం జరుగుతోంది. దరఖాస్తుదారు మీసేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుకు మొబైల్ నంబరును అనుసంధానం చేసుకొని వస్తేనే ఇక్కడ పని ముందుకు సాగుతుంది. వివరాలు నమోదు నుంచి మొదలుకొని వారికి రుణాలు ఇప్పించేంత వరకు సామాజిక కార్యకర్తలు వీధి వ్యాపారుల వెన్నంటి ఉండాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!