దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలో నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, శ్రీ లలితాంబికా దేవాలయాల్లో అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు శ్రీధర్ బాబును శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ఈరోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్ఠించి, మంథని పురవీధుల్లో భజనలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి మంగళ హారతి సమర్పించారు.
నిరాడంబర శోభాయాత్ర
లలితాంబికా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నిబంధనలతో భక్తులు సామాజిక దూరం పాటిస్తూ శోభా యాత్రలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కోలాటాలు, నృత్యాలతో వైభవంగా నిర్వహించే శోభాయాత్ర... కొవిడ్ వల్ల ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిపారు. తొమ్మిది రోజులుగా శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో నిరంతరం భజన కార్యక్రమం జరుగుతోంది. భక్తులు కొద్ది సంఖ్యలో మాత్రమే దేవాలయానికి వచ్చి పూజలు చేస్తూ... ఒడి బియ్యం సమర్పిస్తున్నారు.
ఇదీ చదవండి: కాగజ్‌నగర్‌లో దేవీనవరాత్రులు.. మహాలక్ష్మిగా కొలువైన అమ్మవారు