రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు అన్నదాతకు కీడు చేసేలా ఉన్నాయని ఆరోపించారు. పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చనడం అర్థరహితమని విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణ పల్లి, పాలకుర్తిలోని పుట్నూరు గ్రామాల్లో రైతు వేదిక భవనాలు మంత్రి ప్రారంభించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీఎమ్మెస్ చట్టాన్ని రద్దు చేస్తామని అనాడు చెప్పిన యూపీఏ ప్రభుత్వం నేడు కృత్రిమ ఉద్యమం చేస్తోందని విమర్శించారు.
ఏకైక ప్రభుత్వం..
కరోనా కష్టకాలంలో అన్నదాతకు 'రైతు బంధు, రైతు బీమా' అందించిన ఏకైక ప్రభుత్వం తెరాస అని పేర్కొన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కర్షకులకు 24గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
భాజపా సైతం..
దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుని అన్నదాతకు ఆరువేలు అందిస్తోందని తెలిపారు. అదీ సవాలక్ష నిబంధనలు పెట్టి ఇస్తోందని విమర్శించారు.
తెలంగాణ మాత్రమే ఎలాంటి షరతులు లేకుండా పదివేల రూపాయల రైతుబంధు, రైతు బీమా అందిస్తోంది. పంటకు మద్దతు ధర నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం వారి వద్దే అంటిపెట్టుకుంది. ఆ అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి.
-నిరంజన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి
కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రగతి పథంలో తెలంగాణ వ్యవసాయ రంగం : మంత్రి నిరంజన్ రెడ్డి