KTR Tour in Ramagundam Today : కార్పొరేట్ కంపెనీలకు వంత పాడుతున్న ప్రధాని మోదీ.. ప్రభుత్వ సంస్థలను తన దోస్తులకు అగ్గువకే కట్టబెడుతూ చందాలు తీసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని అమ్మబోమని తెలంగాణలో హామీ ఇచ్చిన మోదీ.. దిల్లీకి వెళ్లగానే సంస్థ నాలుగు గనులను వేలానికి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా.. వేలం పాటలో పాల్గొనమని ఉచిత సలహా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
Minister KTR Comments on Balka Suman : బాల్క సుమన్ మంత్రి అయితే ఎన్నో అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
KTR Fires on BJP : గుజరాత్ మినరల్స్ తరహాలో సింగరేణికి కూడా మైన్స్ కేటాయించమని కోరితే.. మోదీ మొండి చేయి చూపించారని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మోదీ.. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చిండో చెప్పాలని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం అనే పరిస్థితి ఉందన్నారు.
గత ప్రభుత్వాల పాలనలో సింగరేణి కార్మికులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని.. సంస్థ లాభాల్లో వాటా కింద కేవలం 18 శాతం మాత్రమే ఇచ్చేవారని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణి లాభాల్లో కార్మికులకు 42శాతం వాటా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించినట్లు గుర్తు చేశారు.
Minister KTR Tour in Peddapalli District : పట్టణంలో జూనియర్, డిగ్రీ కాలేజీల ఏర్పాటు కోసం కొట్లాడిన గోదావరిఖనికి.. మెడికల్ కాలేజీ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా.. అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నేడు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే కాకుండా 5% రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ.. నేడు రాష్ట్రంలో గ్యారంటీలు ఇస్తామని చెబుతోంది. ముసలి నక్కలాంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతోందని విమర్శించారు.
KTR Fires on Congress : కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అవుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. కాంగ్రెస్ కంటే రెట్టింపు మంచి చేస్తారని పేర్కొన్నారు. పెద్దపల్లిలోని బసంత్‌నగర్ ఎయిర్పోర్ట్ ప్రారంభించమని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేపు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని.. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎక్కువ మంది ఎంపీలు గెలిచినట్లయితే.. కేంద్రం జుట్టు మన చేతిలోకి వస్తుందన్నారు.
రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపిస్తే నియోజకవర్గంను దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలో అందరికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఈ సభకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోరుకొండ చందర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
"సింగరేణిని అమ్మబోమని తెలంగాణలో హామీ ఇచ్చిన మోదీ.. దిల్లీకి వెళ్లగానే సంస్థ నాలుగు గనులను వేలానికి పెట్టారు. గుజరాత్ మినరల్స్ తరహాలో.. సింగరేణికి గనులను కేటాయించాలని కోరాము. ఎటువంటి స్పందన రాలేదు. గుజరాత్‌కు ఒక న్యాయము.. తెలంగాణకు ఒక న్యాయామా అని ప్రశ్నిస్తున్నాను. - కేటీఆర్, మంత్రి