కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పది రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పురపాలక సంఘం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. వారం రోజులుగా జిల్లా కేంద్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇవాళ ఒకరు మృతి చెందారని ఎమ్మెల్యే తెలిపారు.
కరోనా కేసుల కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ కచ్చితంగా పాటించాలని, నిత్యవసర వస్తువులు, కూరగాయలు మాత్రమే కొద్ది సమయం పాటు విక్రయించాలన్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కాగా వ్యవసాయ దృష్ట్యా ఎరువులు, విత్తనాల కోసం దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.