2014 తర్వాత తెలంగాణలో అడవుల విస్తీర్ణం పెరిగిందని.. అందుకే పులుల సంఖ్యా పెరిగిందని.. అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి అక్బర్ పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎక్లాస్‌పూర్‌లో పేర్కొన్నారు. గత 15 రోజులుగా మంథనిలో వివిధ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి అడుగుల గుర్తులు ఒకేలా ఉన్నాయని ఆయన తెలిపారు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ మంథని అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాని అక్బర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అటవీప్రాంతం పెరిగిందని అక్బర్ అన్నారు. వన్యప్రాణులను సంరక్షించడం కోసం అటవీశాఖ ప్రత్యేకంగా చట్టాలు తీసుకువచ్చి శిక్షలు అమలు చేయడం, అంతరించిపోతున్న అడవులను అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా వన్యప్రాణుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడ్డాయని అన్నారు.
ఇటీవల పులిదాడిలో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని అక్బర్ హామీ ఇచ్చారు. అటవీప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామ ప్రజలు.. పశువులు, గొర్రెలను ఎక్కువ దూరం మేతకు తీసుకువెళ్లవద్దని సూచించారు. ప్రజలెవరూ పులులపై దాడి చేయరాదని.. వాటి గురించి ఎలాంటి సమాచారమున్న అధికారులకు తెలియజేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్