Floating Solar Ramagundam NTPC : పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఐదేళ్ల క్రితం నేలపై 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరో అడుగు ముందుకేసి నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించింది. మొదటి దశలో 17.5 మెగావాట్లు, రెండో దశలో 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మొదటి నుంచీ ఎన్టీపీసీ పర్యావరణ హితమే పరమావధిగా పనిచేస్తోంది. నీటిపై తేలియాడే ప్రాజెక్టును నిర్మిస్తుండటంతో ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
రామగుండం ఎన్టీపీసీ జలాశయం సామర్థ్యం 4 వేల ఎకరాలు. దాదాపు 1000 ఎకరాల్లో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఎన్టీపీసి రూ.424 కోట్ల నిధులు సైతం కేటాయించింది. వెయ్యి ఎకరాల్లో నిల్వ ఉన్న నీరును దృష్టిలో పెట్టుకుని... 400 ఎకరాల విస్తీర్ణంలో సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు రచించారు. క్రిస్టలిక్ సిలికాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటో వోల్టాయిక్ ప్యానళ్లు ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సౌర ఫలకాలు, ఇన్వర్టర్ గదులు, ట్రాన్స్ఫార్మలు, హెచ్‌టి బ్రేకర్లూ నీటిపై తేలియాడేలా పనులు చేపట్టారు. 100 మెగావాట్ల విద్యుత్ బ్లాకులో 40 బ్లాకులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి బ్లాకులో కనీసంగా 11,200 సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకముందే డ్రైడాక్ స్టింగులు ఏర్పాటు చేయడం విశేషం. రామగుండంలోని ఎన్టీపీసీ యాజమాన్యం రానున్న ఐదేళ్ల కాలంలో... 50వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది
ఈ సౌర విద్యుత్ కేంద్రానికి ఎలాంటి భూ సేకరణ సమస్య ఉండదు. నీరు కూడా ఆవిరయ్యే అవకాశాలు తక్కువ. నీటి ఫలకాల ఏర్పాటుతో జలాశయం మరింత శోభయమానంగా ఉంది. ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణహిత ప్రాజెక్టులే లక్ష్యంగా పనిచేస్తుంది.
-సునీల్ కుమార్, రామగుండం ఎన్టీపీసీ
వివిధ దశల్లో ఉత్పత్తి ప్రారంభించామని...2022 ఫిబ్రవరి చివరి వరకు 100 మెగా వాట్ల పూర్తి స్ధాయి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ తెలిపారు. తాజాగా 37.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు.
ఇదీ చదవండి: Omicron Cases in Andhra pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు