ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ఎగువ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతి బ్యారేజీకి 83,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సోమవారం బ్యారేజీలో 20 గేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
మంగళవారం పార్వతి బ్యారేజీలోనికి ఎగువ నుంచి వరద అధికమవ్వడం వల్ల నీటిపారుదల అధికారులు 50 గేట్లు ఎత్తివేశారు. అక్కణ్నుంచి 83,529 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపివేశారు. పార్వతి బ్యారేజీ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 7.24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి నది ప్రవాహం ఉద్ధృతమవ్వడం వల్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.