పది రోజులుగా ధాన్యం కొనుగోలు చేయట్లేదని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. మంథని- కాటారం ప్రధాన రహదారిపై వడ్లు పోసి... నిప్పు పెట్టారు. రోడ్డుపై అడ్డంగా బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతుల ధాన్యం.. కొనుగోలు కేంద్రంలోనే పేరుకుపోయి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి ఎగుమతి చేసేందుకు లారీలు తగినన్ని లేవని చెబుతున్నారన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక కుప్పల వద్ద 24 గంటలు పడిగాపులు కాస్తున్నామని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.