Farmers problems for Urea : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో యూరియా కోసం రైతులు ప్రాథమిక సహకార సంఘం ఎదుట బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు. పైరవీలు చేసుకున్న వారికే యూరియా అందిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలో నిలబడినా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన అన్నదాతలు... సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
నిన్న రాత్రి నుంచి సుల్తానాబాద్‌లోని ప్రాథమిక సహకార సంఘం వద్ద పడిగాపులు కాస్తున్నామని... ఈరోజు ఉదయం 10 గంటలు అయినప్పటికీ ఇంకా యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి ఒక లారీ యూరియా లోడు వచ్చిందని... అయితే పైరవీలు చేసుకున్న వారికే యూరియా అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సహకార సంఘం వద్దకు వచ్చిన లారీ యూరియా లోడు వద్ద రైతులు వాగ్వాదం చేశారు. వెంటనే తమకు ఇవ్వాలని సిబ్బందితో గొడవకు దిగారు.
వచ్చిన యూరియా వచ్చినంటే అయిపోతుంది. రాత్రి నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు మాకు అందలేదు. రోజూ వస్తున్నాం. లైన్లలో నిలబడుతున్నాం. ఖాళీ చేతులతో పోతున్నాం. పని కూడా చేసుకోకుండా ఇక్కడికే వస్తున్నాం. ప్రభుత్వం దీనిపై స్పందించాలి. సకాలంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.
-రాజయ్య, రైతు
ఇవాళ వచ్చినవాళ్లకు అయితే యూరియా ఇవ్వలేదు. లైన్ లైనే ఉంటుంది. బస్తాలైతే అయిపోతున్నాయి. వచ్చినోళ్లకు పదుల కొద్దీ ఇస్తున్నారు. కొందరు ట్రాక్టర్లు నింపుకొని పోతున్నారు. వాళ్లకు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదు.
-శంకరయ్య, రైతు
ఇదీ చదవండి: TRS Deeksha for Bayyaram Steel plant : 'బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు..'