పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాలు లేకుండా ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని.. తాలుతో తెచ్చినట్లయితే కొనుగోలు చేయలేమని అధికారులు చెప్పడంతో ధర్నా నిర్వహించారు. తాలుతో పంపిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని.. రైతులు, మిల్లర్లకు మధ్య సమన్వయం కుదిరితే ధాన్యం కొనుగోలు చేస్తామని ఏఎంసీ ఛైర్మన్ సంతోషిణి శ్రీనివాస్ తెలిపారు.
కలెక్టర్‌కు ఫోన్..
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పోలీసులు యార్డుకు చేరుకున్నారు. రైతులను అడిగి ఎమ్మెల్యే సమస్యలు తెలుసుకున్నారు. ఐదురోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తాలు పేరుతో తరుగు తీస్తున్నారని రైతులు వాపోయారు. అకాల వర్షానికి నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. అదనపు కలెక్టర్‌కు ఫోన్ చేసి ధాన్యం కొనగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: కాన్వాయ్‌ను సరెండర్ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్