పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో భాజపా రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు పర్యటించి హైకోర్టు న్యాయవాదుల జంట హత్యలపై వివరాలను సేకరించారు. వారి హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి వామన్‌రావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన కొడుకు, కోడలు హత్యకు సంబంధించి చిన్న చిన్న కారణాలు చూపుతున్నారని... గ్రామంలో తన కొడుకుకు ఎలాంటి విభేదాలు లేవని ఈ హత్య వెనుక రాజకీయ శక్తులు దాగి ఉన్నాయని గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వెల్లడించారు. కొడుకు, కోడలు హత్యలో అధికార పార్టీకి చెందిన తెరాస నేత జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు సుపారి ఇచ్చి హత్య చేయించారని ఆయన ఆరోపించారు. గ్రామంలో గుడి కమిటీ విషయంలో కక్షసాధింపు చర్యగా చూపుతూ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
న్యాయవాదులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపా రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కోమల ఆంజనేయులు తెలిపారు. ఈ హత్య గురించి వారి తల్లిదండ్రులు చెబుతుంటే ఎంతో హృదయవిదారకంగా ఉందని తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వారిని ఉపేక్షించబోమని తెలిపారు. ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయపరమైన అవసరం ఉన్నా పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు