నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌లో నిత్యం 300 నుంచి 500 కరోనా(కొవిడ్ 19) పరీక్షలు నిర్వహించవచ్చని పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. వైరాలజీ ల్యాబ్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతిసారి కరోనా పరీక్షకు హైదరాబాద్ వెళ్లే అవసరం లేదని.. ప్రభుత్వం అత్యాధునిక పరికరాలు జిల్లాకు పంపించిందని.. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ల్యాబ్‌లో కరోనా పరీక్షలు ప్రారంభిస్తామన్నారు.
కొవిడ్ 19 బాధితులకు సౌకర్యాలు
- కరోనా అనుమానితుల కోసం 200 పడకల ఆసుపత్రి సిద్ధంగా ఉందన్నారు.
- ఆసుపత్రిలో మొత్తం 15 వెంటిలేటర్లు ఉన్నాయి.. వీటిలో 10 కరోనా రోగులకు, 5 ఇతర రోగులకు కేటాయించాం.
- వీటికితోడూ 80 మందికి ఆక్సిజన్ సపోర్టింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
- రాష్ట్ర ఆరోగ్యశాఖ మరో 15 వెంటిలేటర్లను కేటాయించింది.
గైనకాలజీ విభాగాన్ని మార్చే ప్రయత్నం
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో ఉన్న గైనకాలజీ విభాగాన్ని ఎదురుగా ఉన్న ఎంసీహెచ్ భవనంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. భవనానికి అవసరమైన జనరేటర్, సీసీకెమెరాలు, మౌలిక సదుపాయాలు కల్పించి వారం రోజుల్లో ప్రసూతి వార్డును కొత్త భవనంలోకి మార్చాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ఖాళీ చేసిన అంతస్తులో 400 నుంచి 500 పడకలు కొవిడ్-19కు వైద్యం చేసేందుకు ఏర్పాటు చేయాలని నారాయణ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, ఇతర వైద్య అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి: జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కేసులు