నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు తెగుళ్ల బెడదతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు. అధిక వర్షాల వల్ల దుంపకుళ్లు తెగులు ఆశించడంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పసుపు పంటను బెడ్డు, సాళ్ల పద్ధతిలో సాగు చేస్తారు. సాళ్ల పద్ధతిన వేసిన పంటలో వర్షాలకు నీరు నిలిచిపోయి... పసుపు కొమ్ములు, దుంప కుళ్లిపోతున్నాయి.
రాష్ట్రంలోనే పసుపు సాగు విషయంలో నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధి చెందింది. దాదాపు 40 వేల ఎకరాల్లో నాణ్యమైన రకాలు పండిస్తున్నారు. మార్కెట్లో మద్దతు ధర లేనప్పటికి సాగు వదులుకోలేక పంట పండిస్తున్నారు. గత ఏడాదిలాగానే ఇప్పుడు దుంపకుళ్లు తెగులు దిగుబడిపై అధిక ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.