నిజామాబాద్ జిల్లాకు మొదటి శ్రామిక్ రైలు రానుంది. కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు ముంబయి నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాకు రానున్నారు. వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా ముంబయి నుంచి నిన్న రాత్రి 9 గంటలకు బయల్దేరిన శ్రామిక్ రైలు.. నిజామాబాద్ కు మధ్యాహ్నం 2గంటల తర్వాత రానుంది. మొత్తం 1,725మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలు దేరినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక బస్సుల ద్వారా.. స్వస్థలాలకు
ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 482 మంది ఉన్నారు. నిజామాబాద్ తో పాటు జగిత్యాల, కరీంనగర్ లోనూ ఈ రైలు ఆగుతుంది. నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన వలస కార్మికులు నిజామాబాద్ లోనే దిగనున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని సొంత జిల్లాలకు పంపనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారిని జగిత్యాల, కరీంనగర్ లలో దింపనున్నారు.
థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరి
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. అక్కడి నుంచి వలస కార్మికులతో రైలు వస్తోంది.. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. నిజామాబాద్ రైల్వే స్టషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్మికులు రైలు దిగగానే వారికి మాస్కులు, శానిటైజర్ అందించి థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేయనున్నారు. చేతికి క్వారంటైన్ ముద్ర వేసి ప్రత్యేక బస్సుల్లో నేరుగా సొంత ప్రాంతానికి తరలించనున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్ష చేయనున్నారు.
ఇదీ చూడండి: ఒకే ఇంట్లో నలుగురికి కరోనా