Tension at Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చిత్రపతి శివాజీ విగ్రహాం ఏర్పాటు.. ఉద్రిక్తతకు దారితీసింది. శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా... పోలీసులపైకే రాళ్లు రువ్వారు. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో.. టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్ధితి చక్కదిద్దారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని... గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.
బోధన్ బంద్‌కు పిలుపు...
శివాజీ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు సోమవారం బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్... కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలలో భాగంగా.. హిందూ వాహిణి నేతలతో పాటు శివసేన, భాజపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల రోడ్లను మూసివేశారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలోనూ పోలీసులను మోహరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌తోపాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డీజీలు నాగిరెడ్డి, కమలాసన్‌రెడ్డి బోధన్‌లో పరిస్ధితిని సమీక్షించారు. బలవంతంగా బంద్‌కు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని అదనపు డీజీ నాగిరెడ్డి హెచ్చరించారు.
హోంమంత్రి ఆరా...
బోధన్‌లో ఉద్రిక్తతపై హోంమంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ నాగరాజుతో మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ...హోంమంత్రికి వివరించారు. అన్ని కులాలు, మతాలకు సమానమైన గౌరవం ఇస్తామన్న హోంమంత్రి.. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శివాజీ విగ్రహానికి మున్సిపల్ అధికారులు ముసుగు వేశారు. పాలనాపరమైన అనుమతులు ఉంటేనే.. విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తామని ప్రకటించారు.
లాఠీలతో దాడులు చేయడం ఏంటి?
బోధన్‌లో లాఠీఛార్జ్‌ను భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు అనుమతిచ్చారని తెలిపారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులే... రబ్బర్ బులెట్లతో, లాఠీలతో దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: