TU Controversy Latest Issue : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతోంది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు బజారున పడుతోంది. వీసీగా రవీందర్ గుప్తా బాధ్యతలు తీసుకుని నిండా రెండేళ్లు కూడా పూర్తి కాకముందే.. ఇప్పటికే తొమ్మిది సార్లు రిజిస్ట్రార్‌లు మారారు. రిజిస్ట్రార్ మొదలు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల వరకూ వివాదాస్పదమైంది.
TU VC Controversy : రిజిస్ట్రార్‌ను టీయూ పాలక వర్గం నియమిస్తే.. వైస్ ఛాన్స్‌లర్ మోకాలడ్డడం, వీసీ నియమిస్తే ఈసీ ఆమోదం తెలపకపోవడం వంటి ఘటనలతో కొన్ని నెలలుగా సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్‌లో పీడీఎస్‌యూ, బీవీఎం, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. వీసీ వెంటనే రాజీనామా చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. వీసీ టేబుల్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ అసలు కథ.. : టీయూ పాలకవర్గం వర్సెస్ వైస్ ఛాన్స్‌లర్ మధ్య గొడవలతో విశ్వవిద్యాలయం పరువు బజారున పడుతోంది. నెలల తరబడి ఎడతెగని వివాదాల మూలంగా అకడమిక్, నాన్ అకడమిక్ సిబ్బంది సైతం తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. వీసీ పదవిని అడ్డం పెట్టుకుని రవీందర్ గుప్తా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, నిధులను నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించడం వంటి ఆరోపణలపై ఈసీ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. విచారణకు ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సైతం లేఖలు రాసింది. మరోవైపు వీసీ అధికారాలను కత్తిరించింది. క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కలిసి పని చేస్తామని ఈసీ సభ్యులకు రవీందర్ గుప్తా చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగినట్లే అనిపించింది. కానీ రవీందర్ గుప్తా మళ్లీ రిజిస్ట్రార్‌ను మార్చడంతో వివాదం మొదటికి వచ్చింది.
- Telangana University Issues : తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ నియామక పంచాయతీ మళ్లీ మొదటికొచ్చే
రిజిస్ట్రార్ కుర్చీ కొట్లాటలో వర్సిటీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఆచార్య యాదగిరికి విద్యార్థి సంఘాలు, ఆచార్య కనకయ్యకు ఉద్యోగులు మద్దతు ఇస్తున్నారు. దళిత విద్యార్థి సంఘాలు సైతం కనకయ్యకు మద్దతుగా నిలబడ్డాయి. వీసీగా రవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టాక కనకయ్యను రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు, పదోన్నతులు వంటివి చేపట్టారు. ఇందుకోసం డబ్బులు తీసుకుని అక్రమంగా నియమించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో కనకయ్యను ఈసీ తొలగించి యాదగిరికి బాధ్యతలు అప్పగించింది.
Telangana University VC Controversy : కొద్ది కాలానికే యాదగిరి చేతులెత్తేయడంతో ఆ తర్వాత ఆచార్య శివశంకర్‌కు బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలు తర్వాత శివశంకర్‌ను సైతం వీసీ రవీందర్ గుప్తా మార్చారు. అనంతరం విద్యావర్ధినికి రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగిస్తే.. ఆమె 8 నెలలు పదవిలో ఉన్నారు. మళ్లీ ఈసీ సమావేశంలో వీసీ నియమించిన విద్యావర్ధినిని తొలగించారు. మరోసారి యాదగిరిని తిరిగి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈ నియామకాన్ని వ్యతిరేకించిన వీసీ రవీందర్ గుప్తా హైకోర్టుకు వెళ్లారు. స్టే తీసుకొచ్చారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్‌ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినా.. రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే మళ్లీ జరిగిన ఈసీ సమావేశంలో యాదరిగినే రిజిస్ట్రార్ అంటూ ఈసీ మళ్లీ తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని కాదన్న వీసీ.. ఇటీవల మళ్లీ ఆచార్య కనకయ్యకు పదవి అప్పగించారు.
ప్రస్తుతం తెలంగాణ వర్సిటీకి ఇద్దరు రిజిస్ట్రార్‌లు ఉన్నారు. యాదగిరిని ఈసీ నియమించగా.. కనకయ్యను వీసీ నియమించారు. రెండు రోజులుగా ఎవరు ముందొస్తే.. వాళ్లే రిజిస్ట్రార్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. శనివారం కనకయ్య రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చుంటే.. సోమవారం యాదగిరి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చున్నారు. ఎవరు రిజిస్ట్రారో తెలియక వర్సిటీలో అంతా తలలు పట్టుకుంటున్నారు. నేనంటే నేను రిజిస్ట్రార్ అంటూ యాదగిరి, కనకయ్యలు ఏకంగా వాగ్వాదానికి దిగడంతో కుర్చీ కోసం పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పరిస్థితి చక్కదిద్దాల్సిన పాలక మండలి, కలిసి పని చేయాల్సిన వీసీ రవీందర్ గుప్తా సైతం వివాదాన్ని రాజేస్తుండటంపై పలువురు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి.. సమస్యను పరిష్కరించి పరిపాలనను గాడిలో పడేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..
TU VC Comments on Naveen Mittal: 'ప్రశాంతంగా ఉన్న టీయూలో నవీన్ మిత్తల్ రాజకీయాలు చేస్తున్నారు'
TU VC reaction: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వర్శిటీకి ఈ పరిస్థితి వచ్చింది'
ఊరి కోసం బ్రిడ్జి కావాలంటూ 250కి.మీల నడక.. 'సీఎం' మాత్రమే ఆ పని చేస్తారని..