Sankranthi Pindi Vantalu: సంక్రాంతి పండగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. మారుతున్న జీవనశైలి, ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరికలేకపోవడం వల్ల చాలామంది మార్కెట్‌లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. కొన్నేళ్లుగా దుకాణాల్లో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి వేళ అప్పాల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. సకినాలు, అరిసెలు, చెగొడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజలు ఇలాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది.
అందుబాటు ధరల్లో రుచిగా
మన రాష్ట్ర సంస్కృతిలో భాగంగా అప్పాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కుటుంబసభ్యులందరూ కలిసి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఓపిక, తీరిక రెండూ లేకపోవడంతో ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటున్నాం. అందుబాటు ధరల్లోనే రుచికరమైన సంప్రదాయ పిండివంటలు అందిస్తున్నారు. --- వినియోగదారులు, నిజామాబాద్
నిజామాబాద్‌లోనే దాదాపు 20 వరకు పిండి వంటల తయారీ కేంద్రాలు ఉండగా ఒక్కో దాంట్లో 10 నుంచి 15 మంది వరకు మహిళలు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వినియోగదారులు సైతం రుచికరమైన పిండివంటలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాటికి డిమాండ్ ఎక్కువ
లడ్డూలు, అరిసెలు, సకినాలు, గారెలు, గరిజలు బాగా అమ్ముడుపోతాయి. కానీ సంక్రాంతి సీజన్లో అరిసెలు, నువ్వుల లడ్డూలు, సకినాలు బాగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఉద్యోగ జీవితాల్లో పడి చాలా మందికి తీరిక లేకపోవడంతో ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటున్నారు. --అప్పాల తయారీదారులు, నిజామాబాద్
తీరికలేని జీవితాల కారణంగా ఇళ్లలో తయారీ చేసుకోవడం బాగా తగ్గిపోయింది. ప్రజలు అమితంగా ఇష్టపడే పిండివంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విలువైన సమయం వృథా కాకుండా, ప్రయాస పడకుండానే పిండివంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చదవండి: Sankranti Celebrations 2022: శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబురాలు