నిజామాబాద్-డిచ్‌పల్లి మార్గంలో నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద రైల్వే గేట్ ఉంది. హైదరాబాద్-నిజామాబాద్ ప్రధాన మార్గంలో ఈ గేట్ ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. గత 2020 నవంబర్‌లో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం కేంద్రం ప్రకటన చేసింది. రెండు లైన్ల ఆర్వోబీ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. అయితే 4 లైన్ల ఆర్వోబీ కావాలని జిల్లా నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకయ్యే ఖర్చును రాష్ట్రమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. 93కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేయగా.. కేంద్రం వాటా కింద 30కోట్లు ఇచ్చేందుకు అంగీకరిచింది. రాష్ట్ర వాటాగా 63 కోట్లు సమకూర్చాల్సి ఉంది. ఇప్పుడు ఈ నిధుల అంశం రాజకీయరంగు పులుముకుంది. భాజపా, తెరాసల మధ్య మాటయుద్ధానికి దారితీసింది.
ఎంపీ అర్వింద్ విమర్శలు
రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతోనే ఆర్వోబీ పనులు ఆగిపోయాయని భాజపా ఎంపీ అర్వింద్ విమర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆర్వోబీ డీపీఆర్‌ను కేంద్రానికి పంపకుండా 9నెలలు కాలయాపన చేశారని ఆరోపించారు. గత నెల 28న ఎంపీ అర్వింద్ మాధవనగర్ ఆర్వోబీ వద్ద నిరసన తెలిపారు. దీనికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లను ఆహ్వానించారు. పత్రికల్లో ప్రకటనలు పంపిణీ చేసి ఎంపీ నిరసన తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.
మండిపడిన మంత్రి
అర్వింద్ ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్వోబీలకు కేంద్రమే పూర్తిగా నిధులివ్వాలని పార్లమెంటులో ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. ఎంపీ అర్వింద్‌కు రాజకీయమే తప్ప... ప్రజల బాగోగులు అవసరం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
ప్రజల ఆవేదన
ఆర్వోబీ నిర్మాణం రాజకీయ రంగు పులుముకోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టి ఆర్వోబీ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: DIGITAL CLASSES: సర్కారు బడుల్లో సవాలుగా మారిన డిజిటల్ పాఠాలు