నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా మలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతుండగా... మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
ఎన్నో ప్రమాదాలు:
ఈనెల 19న తెల్లవారుజామున కంటైనర్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సాంపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది.
కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్‌లో భాగంగా... భారీ పైపులను తీసుకెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
వారం రోజుల వ్యవధిలో ఇదే మూలమలుపు వద్ద తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భారీ పైపుల లోడ్‌తో యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ, ఢీ కొట్టింది. కంటైనర్ పైన ఉన్న పైపులు రోడ్డుపై పడడంతో ముందు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో పైపులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు ట్రాలీ ఆటోలో ఉన్న హర్షవర్ధన్, గౌతమ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. భారీ వాహనాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ ప్రమాదాలు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సాంపల్లి-సుద్దపల్లి మధ్యలో గత కొన్ని నెలలుగా కాళేశ్వరం పనులకు ఉపయోగించే భారీ పైపులకు రేలింగ్ పనులు నడుస్తున్నాయి. భారీ పైపులతో పెద్ద కంటైనర్లు నిత్యం పదుల సంఖ్యలో వస్తూ ఉంటాయి. అయితే సుద్దపల్లి వద్ద వంతెన చిన్నగా ఉండటంతో కంటైనర్లను సాంపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ కంటైనర్లు రోడ్డుకు అడ్డంగా రావడంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
మలుపు వద్ద లైట్లను పెట్టండి
లైట్లు లేకపోవడం, యూటర్న్ తీసుకుంటున్న వాహనం కనిపించక వాహనాలు ఢీకొట్టి ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. మలుపు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలని, డివైడర్ మూసివేసి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ప్రాణాల్ని కాపాడండి
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సాంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించి... ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు