రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా కనువిందు చేస్తున్నాయి. చెరువులు, వాగులు, కుంటలు అలుగు పారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, చెరువులు అలుగు పారుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల అలుగు పారుతున్నచెరువుల నుంచి చేపలు పొలాల్లోకి కొట్టుకొస్తున్నాయి. దీంతో చేపలను పట్టుకునేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు.
వీరికి ఆనందం..
వాటిని చూడగానే చిన్న పిల్లల్లా పరుగులు తీస్తూ... ఒకరిని ఒకరు తోసుకుంటూ చేపల కోసం ఎగబడ్డారు. గ్రామాలకు దగ్గరే చెరువు ఉండడంతో చిన్నా, పెద్ద చేపల వేటలో మునిగిపోయారు. వలలు, కర్రలు, చేతులతో చేపలను పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ... పోటీపడ్డారు. దొరికిన వారు సంతోషంగా ఇంటికి తీసుకెళ్తున్నారు.
గంగపుత్రుల ఆవేదన
ఇదిలా ఉండగా చెరువుల నుంచి చేపలు కొట్టుకుపోకుండా గంగపుత్రులు ప్రయత్నిస్తున్నారు. కిలోల బరువు పెరిగిన చేపలు.. అమ్ముకుందామనుకునే సమయంలో ఇలా కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: fishes: రోడ్లు, పొలాల్లో చేపలు.. పట్టుకునేందుకు జనాల పరుగులు.!