నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని గోల్‌బంగ్లా ప్రాంతంలో గిర్మాజీ రాజేందర్ (40) అనే వ్యక్తి తన సొంత ఇంట్లో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. ఆయన ఇంట్లో పక్కనే అద్దెకుండే బాలనర్సయ్య అదే సమయంలో తన భార్యతో గొడవకు దిగాడు. వీరి అరుపులతో టీవీ సరిగా వినిపించకపోవడం వల్ల రాజేందర్ టీవీ శబ్దం పెంచాడు.
అది చూసి కోపోద్రిక్తుడైన బాలనర్సయ్య.. రాజేందర్‌తో గొడవకు దిగి ఆయన తల, చెవులపై చేతితో కొట్టాడు. యజమాని రాజేందర్ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. నిందితుడు బాలనర్సయ్య పరారీలో ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!