కేంద్ర ప్రభుత్వానికి పేరొస్తుందన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని భాజపానేత, మాజీ ఎంపీ వివేక్ మండిపడ్డారు. గతంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టాలని నిరసన తెలిపిన పార్టీలే ఇప్పుడు వ్యతిరేకించడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
చట్టాలలో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఏ ప్రభుత్వమూ రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించదని తెలిపారు. రాష్ట్రంలో తెరాసపై వ్యతిరేకత ఉందనడానికి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారని విమర్శించారు. జోనల్ విధానం తేలకుండా పోస్టుల భర్తీ సాధ్యం కాదని వివేక్ వెల్లడించారు.