Public Toilets Issue in Nizamabad: నిజామాబాద్ నగరంలో ప్రజాధనం వెచ్చించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చే ప్రజలకు మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు. నగరపాలక సంస్థ వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో.. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు దుర్గంధ భరితంగా మారాయి. లోపలికి అడుగు పెట్టాలంటే దుర్వాసనతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అవసరం తీర్చుకోవడం అటు పెడితే.. అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో బహిరంగ ప్రదేశాలే మరుగుదొడ్లుగా మారే దుస్థితి ఏర్పడుతోంది. నీళ్లు లేక, శుభ్రం చెయ్యక.. నిర్వహణ కొరవడడంతో నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. దాంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రద్దీ లేని ప్రాంతాల్లో నిర్మాణం..: ఉపయోగపడే చోట కాకుండా.. రద్దీ లేని ప్రాంతాల్లో టాయిలెట్స్ నిర్మించడంతో అవి నిరుపయోగంగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలో ఆర్మూర్ రోడ్ కంఠేశ్వర్ చౌరస్తా వద్ద రద్దీ ఉంటుంది. కానీ అక్కడ ఈ టాయిలెట్స్ కనిపించవు. హైదరాబాద్ రోడ్‌లో నిఖిల్ సాయి చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్, ఆర్యనగర్ ప్రాంతంలో రద్దీ ఉంటుంది. కానీ హనుమాన్ జంక్షన్‌కు దూరంలో చెట్ల మాటున మరుగుదొడ్లు పెట్టారు. దీంతో వీటిని ఎవ్వరూ వాడటం లేదు. ఇక అత్యంత రద్దీగా ఉంటే వీక్లీ మార్కెట్, దేవీ రోడ్, గంజ్ మార్కెట్‌లో ఎక్కడా టాయిటెల్స్ ఉండవు. గాంధీ చౌక్, నెహ్రూ చౌక్, శివాజీ నగర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, కోర్టు చౌరస్తా ప్రాంతంలో రద్దీ ఉంటున్నా.. వీటిని ఏర్పాటు చేయలేదు.
'నిజామాబాద్ నగరంలో ఇటీవల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. అయితే నిత్యం రద్దీ ఉండే ప్రదేశాల్లో కాకుండా.. ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కట్టి వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఆ టాయిలెట్లలోకి వెళ్లాలంటే ఆ దుర్గంధానికి కాలు కూడా పెట్టబుద్దికాదు. కొన్ని బాత్రూంలలో నల్లాలు విరిగిపోయి.. నీరంతా వృథాగా పోతుంది. మరికొన్నింటిలో అసలు నీరే రావడం లేదు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు పట్టించుకోవడం లేదు. ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన ఈ టాయిలెట్లు.. ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నాం.' - స్థానికులు
ఇప్పటికైనా నిజామాబాద్ నగర పాలక సంస్థ.. పబ్లిక్ టాయిలెట్ల సమస్యపై దృష్టి సారించి.. వాటి నిర్వహణను మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..
Viral Video : మద్యం మత్తులో రౌడీ షీటర్ వీరంగం.. అడ్డుకున్న పోలీసులపై దాడి
Yadadri temple: భక్తులకు ఎండ నుంచి ఉపశమనం.. ఏర్పాట్లు చేసిన అధికారులు