నిజామాబాద్ జిల్లా పిప్రీ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ గంగపుత్ర నగర సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. గంగపుత్ర కుటుంబాలపై విధించిన సామాజిక బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందించారు.
చేపల ధర వీడీసీ నిర్ణయించడమేమిటీ ?
ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామంలోని చెరువులో చేపలు పట్టి విక్రయిస్తున్న గంగపుత్రుల పట్ల వీడీసీ నిరంకుశంగా వ్యవహరిస్తోందని సంఘం అధ్యక్షుడు అన్నయ్య గంగపుత్ర మండిపడ్డారు. పిప్రీలోని 38 గంగపుత్ర కుటుంబాలను వీడీసీ సభ్యులు ఏడాదికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడీసీ కమిటీ చెప్పిన ధరకే చేపలు అమ్మాలంటూ తమపై పెత్తనం చెలయిస్తున్నారని అసోసియేటడ్ అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ గంగపుత్ర ధ్వజమెత్తారు. వీడీసీని వ్యతిరేకించినందుకు పిప్రీలో గంగపుత్రులకు సహాయ నిరాకరణ చేయాలని కమిటీ హుకుం జారీ చేసిందన్నారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని వినోద్ స్పష్టం చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ వీడీసీపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వినోద్ స్పష్టం చేశారు.
మళ్లీ ఇలా జరగకూడదు...
ఒక్క పిప్రీ గ్రామమే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో వీడీసీలు తమపై జులుం ప్రదర్శిస్తున్నాయని పేర్కొంది. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్లో సంఘం విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మాకు రవి గంగపుత్ర, గౌరవ అధ్యక్షుడు టప్ప అబ్బయ్య, ఉపాధ్యక్షుడు ఆలూర్ దాసు, ముంజాల గంగాధర్, దగ్గుల మధుసూదన్, మూడారి వేణుగోపాల్, దుబ్బాక ప్రవీణ్ కుమార్, పాముల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కొవిడ్ మందుల బ్లాక్ మార్కెట్... అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్