Nizamabad General Hospital: జిల్లా కేంద్రాసుపత్రులకు నిత్యం రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్య సమస్య తలెత్తితేనే... రోగులు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకుంటారు. ఇందుకు భిన్నంగా వైద్యారోగ్యశాఖ ముందుకు సాగుతోంది. వైద్య శిబిరాల ఏర్పాటు ద్వారా కంటి, ఎముకల విభాగంలో ప్రజల్లో ఉన్న సమస్యలను ముందే గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వ్యాధి తీవ్రత ముదరక ముందే చికిత్స అందించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో జిల్లా అంతటా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పారామెడికల్ సిబ్బందితో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. మొదటి దశలో సమస్య ఉన్న వారిని గుర్తించారు. రెండో దశలో వారికి అవసరమైన చికిత్స అందిస్తారు. సర్జరీలు అవసరమైన వారిని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి పూర్తి చేయించి తిరిగి పంపిస్తారు.
ఎముకల విభాగంలో చికిత్స కోసం గుర్తించిన వారికి ఎండల తీవ్రత తగ్గాక... కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయనున్నారు. కంటి చికిత్స విభాగంలో 60మందికి ఆపరేషన్లు చేసి ఆస్పత్రి వాహనంలోనే ఇంటికి పంపించారు. మిగతా వారిలో సర్జరీలు అవసరమైన వారికి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రుల్లోనే కీళ్ల మార్పిడి సర్జరీలు చెయ్యాలన్న ప్రభుత్వ ఆదేశాలతో రెండు విభాగాల్లో సర్జరీలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి, కీళ్ల సమస్యలు ఉన్నా... దూరభారం, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకునేందుకు ముందుకు రారు. ఈ క్రమంలో ఈ వైద్య శిబిరాల వల్ల రోగులకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలయ్యే ప్రమాదం నుంచీ తప్పించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రోగుల చెంతకే వచ్చి వ్యాధిని గుర్తించి ఉచితంగా తీసుకెళ్లి కావాల్సిన సర్జరీలు చేసి తిరిగి ఇంటికి పంపించడం పట్ల రోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.