తలరాత మార్చే వాణిజ్య పంట
పసుపు.. రైతుల తలరాతను మార్చే వాణిజ్య పంటగా మారింది. ధర ఏ మాత్రం తగ్గినా నష్టాలు అధికంగా చుట్టుముడుతాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించే విధానం లేకపోవడం కర్షకుల పాలిట శాపంగా మారింది. వ్యాపారులు, దళారుల ఇష్టారీతిన ప్రస్తుతం మార్కెట్ కొనసాగుతోంది. తెలంగాణలో గతేడాది లక్షా 25 వేల ఎకరాల్లో సాగు చేయగా. ఈసారి లక్షా 35 వేల ఎకరాలకు పెరిగింది. క్వింటాకు కనిష్ఠంగా రూ.4 వేలు, గరిష్ఠంగా రూ.6,700 ఇస్తున్నట్లు నిజామాబాద్ పసుపు మార్కెట్ అధికారులు సర్కారుకు తెలిపారు. తమిళనాడులో క్వింటాకు రూ.5,500 నుంచి రూ.7,500 వరకు ఇస్తున్నారని రాష్ట్రంలో ధర తక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు.
లాభం ప్రశ్నార్థకమే
ఎకరా పసుపు సాగుకు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. పంటలో తేమశాతం ఎక్కువగా ఉందంటూ.. వ్యాపారులు ధరను తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖర్చులు పోనూ ఏమీ మిగలడం లేదని.. ఇక ఎలా బతకాలని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో నిజామాబాద్ మార్కెట్లో 1.25 లక్షల క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. ఇప్పుడే ధర లేనందున రానున్న రోజుల్లో మరింత దిగజారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సమన్వయ లోపమే ప్రధాన సమస్య
రాష్ట్రంలో పసుపు సాగు మార్కెటింగ్ విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపమే ధర తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉద్యాన శాఖ గత రెండేళ్లుగా పసుపు దిగుబడి పెంచడానికి చర్యలు తీసుకుంది. దానికి అనుగుణంగా కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. కంది, పత్తి, సోయా పంటల మద్దతు ధరపై దృష్టి పెట్టిన వ్యవసాయ శాఖ పసుపును వదిలేసిందనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి :పసుపు రైతుల అరెస్ట్...