Dilapidated archaeological exhibition hall: ఇది నిజామాబాద్ తిలక్ గార్డెన్‌లో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల..! ఇక్కడ ఒక ప్రదర్శనశాల ఉందనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఎప్పుడో మరిచిపోయినట్లు ఉందీ పరిస్థితి.. పిచ్చిమొక్కలతో.. పున:ప్రారంభం కాకముందే మళ్లీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఫలితంగా నేటి బాలలకు జిల్లా చరిత్ర తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.
ఇందూరు ఉత్సవాల సందర్భంగా 2001లో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ నిజామాబాద్ తిలక్ గార్డెన్‌లో జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న శిల్పాలు, శిలాశాసనాలు, విశేష ప్రాచుర్యం పొందిన తాళపత్ర గ్రంథాలు, నాణేలు సేకరించి ప్రదర్శనగా ఉంచారు. వారంలో ఒకరోజు ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యం కల్పించారు. ఐతే పురాతన భవనం కావడంతో వర్షాకాలంలో గోడలపై నుంచి నీరు ధారలుగా కారుతూ అపురూపగ్రంథాలు, ఆభరణాలు చెడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో 2012 నుంచి 2014 వరకు మూసి ఉంచారు. ఈ సమస్యపై కథనాలు రావడంతో స్పందించిన ఉన్నతాధికారులు మరమ్మతులు చేయించారు.
సరైన ప్రణాళిక లేకపోవడంతో పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఏర్పడింది. తర్వాత సుమారు 40 లక్షలతో డంగు సున్నం, రంగులు వేశారు. వస్తువులు ఉంచేందుకు అవసరమైన కొత్త అల్మారాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచామని చెప్పారు. ప్రదర్శనశాలను పరిశీలించిన కరీంనగర్ జోన్ సహాయ సంచాలకులు అవసరమైన నిధులు కేటాయించి పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు వచ్చి ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర శాఖకు పంపారు. ఇదంత జరిగినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. రేపటి తరానికి చరిత్రను తెలిపే ఈ ప్రదర్శనశాలను తెరవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: