దాడులతో భాజపా ఎదుగుదలను అడ్డుకోలేరని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. పార్టీ ఉన్నతిని జీర్ణించుకోలేకనే తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యనంపల్లితండాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు.
![MP Arvind visits injured activists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11184054_nl-1.png)
ఈ సందర్భంగా బూత్ కమిటీలు ఏర్పాటు చేసి.. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తే దాడులకు తెగబడటం దారుణమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనకు పోలీస్ శాఖనే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను పారదోలే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
ఇదీ చూడండి: ఉపాధి, ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: కోదండరాం