పుర ఎన్నికల్లో భాగంగా సామాజిక వర్గాల గణనను గత నెల 22 చేపట్టి ఈ నెల 4న ముగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓటర్లు ఎంత మంది ఉన్నారనేది అధికారింగా ప్రకటించలేదు. ముసాయిదా మాత్రమే విడుదల చేశారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు పలు పురపాలక సంఘాల్లో అనేక తప్పులు వెలుగు చూస్తున్నాయి.
ఆదరాబాదరాగా...
ఉన్నతాధికారుల ఒత్తిడి, జిల్లా అధికారుల ఆదేశాలు.. మొత్తానికి సామాజిక వర్గాల సర్వేను జిల్లా వ్యాప్తంగా ఆదరాబాదరాగా చేపట్టారు. కొత్త ఓటర్లు, పలు గ్రామాలు పురపాలక సంఘాల్లో విలీనం అవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్వే నివేదిక ఆధారంగానే డివిజన్లు, వార్డుల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అధికారుల ఒత్తిడితో సర్వే చేయడం వల్ల పొరపాట్లు దొర్లగా రిజర్వేషన్లు తారుమారు కావొచ్చని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
పొరపాట్లు..
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బీసీ ఓటర్లుగా నమోదు చేశారు. కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న ఓసీలను బీసీ ఓటర్లుగా లెక్కించారు. కొత్తగా ఏర్పడిన 28వ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రం 53లో 1,200 మంది ఓటర్లు.. 29వ డివిజన్‌లోని 55వ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. 55 పోలింగ్ కేంద్రంలోని 955 ఓట్లు 53 పీఎస్‌లోకి వెళ్లాయి. బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, భీమ్‌గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘాల్లో సైతం ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు దొర్లినట్లుగా సమాచారం.
అభ్యంతరాలు తెలపొచ్చు
ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులపై అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వివరాలు రాసి పురపాలక సంఘాల కమిషనర్లకు ఇవ్వాలి. వీటిని అధికారులు ఈ నెల 13న పరిశీలిస్తారు. 14న ఓటర్ల జాబితాతో పాటు సామాజిక వర్గాల వివరాలను ప్రకటిస్తారు. రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ జాన్ సాంసన్ సూచించారు.
- ఇదీ చూడండి : చివరి దశకు చేరుకున్న యాదాద్రి