ఇందూరు జిల్లా రైతులు అధైర్య పడొద్దు.. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు.. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల ఛైర్మన్లతో సమీక్షిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో అలసత్వం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 338 కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించినట్లు పేర్కొన్నారు.
ధాన్యం సేకరణలో అలసత్వం వహించిన ధర్పల్లి మండలం హొన్నాజిపేట, నవీపేట సహకార సంఘాల కార్యదర్శులు గంగ నర్సయ్య, నరేష్‌లను సస్పెండ్ చేస్తూ డీసీవో సింహాచలం ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి తెలిపారు. అలాగే తూకం తక్కువ వేస్తున్న గుండారంలోని పూజా ధర్మకాంటను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యాన్ని దించుకోవడంలో అలసత్వం వహించిన 16 బియ్యం(రైస్) మిల్లులకు జిల్లా అధికారులు మెమోలు జారీ చేశారన్నారు. లారీలను సకాలంలో పంపించని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ట్రాన్స్‌పోర్టు యజమాని ఎంఎ.భారికి రూ. 50 వేల జరిమానా విధించినట్లు ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
ఆర్డీవో ఆరా...
రెంజల్ మండలంలో ధాన్యం విక్రయాల తీరును ఆర్డీవో గోపీరామ్ పరిశీలించారు. రైస్‌మిల్లర్లు అదనపు కోత విధిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోత విధిస్తున్న మిల్లుల వివరాలను సహకార కార్యదర్శి రాందాసును అడిగి తెలుసుకొన్నారు. నిబంధనలు పరిశీలించకుండా మిల్లులకు పంపుతూ రైతులను ఇబ్బందుల పాలు చేయడంపై కార్యదర్శితో పాటు ధ్రువీకరణ బాధ్యతలు నిర్వహించే అధికారిపై మండిపడ్డారు.
బోధన్‌కు చెందిన మిల్లర్లు క్వింటాలుకు రెండు నుంచి ఐదు కిలోల వరకు కడ్తా(తరుగు) తీసుకుంటున్నారని కర్షకులు వాపోయారు. రైతుల వాంగ్మూలాన్ని నమోదు చేయాలని తహసీల్దార్ అసదుల్లాఖాన్‌కు ఆదేశించారు.