Holi Celebrations: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగరోజు పిడిగుద్దుల వర్షం కురిసింది. ఊరంతా వర్గాలుగా విడిపోయి ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు. అయితే.. ఆ ఊరి వాళ్ల మధ్య ఏదో పెద్ద గొడవలే వచ్చి పడ్డాయని కంగారుపడిపోకండి. కొన్ని పండుగలకు ఆయా ప్రాంతాల్లో కొన్ని వింత ఆచారాలు అమల్లో ఉంటుంటాయి. పూర్వంలో జరిగిన కొన్ని సందర్భాలను ఆధారంగా చేసుకుని.. పాటించే పద్ధతులను అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆచారాల్లాగా పాటిస్తుంటారు. అందులో భాగంగానే.. హోలీ పండుగ రోజు ఉదయమంతా రంగులు చల్లుకుని.. సాయంత్రం కాగానే ఊరి మధ్యలో సమాజికవర్గాలుగా విడిపోయి పిడికిలి బిగించి కొట్టుకోవడం హున్సా గ్రామ ఆనవాయితీ అన్నమాట.
మూడు వందల ఏళ్ల నేపథ్యం..
మూడు వందల ఏళ్లుగా గ్రామంలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఉదయం అంతా రంగులు పూసుకుని వేడుక చేసుకుంటారు. సాయంత్రం 6 ప్రాంతంలో ఊరి మధ్యలోని ఆంజనేయస్వామి గుడి ముందుకు ఊరేగింపుగా అంతా చేరుకుంటారు. అక్కడే ఉన్న స్తంభాలకు బలంగా ఓ తాడు కడతారు. ఇరువైపులా ఉన్న జనం.. సామాజిక వర్గాలుగా విడిపోతారు. వాళ్ల మధ్యలో ఎలాంటి గొడవలు లేకున్నా.. పిడికిళ్లు బిగించి ఇష్టమున్నట్టు కొట్టుకుంటారు. ఈ తంతును మహిళలు, పిల్లలంతా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. ఈ ఆట జరుగుతున్నంత సేపు పోలీసులది కూడా ప్రేక్షక పాత్రే. పోలీసులు ఆంక్షలు విధించినా.. ఈ తంతు జరగకపోతే ఊరికే అరిష్టం అని భావించే గ్రామస్థులు.. యథావిధిగా ఈరోజు కూడా ఈ పిడిగుద్దులాటను కొనసాగించారు.
ఎప్పటిలాగే కోలాహలంగా..
ఉదయం సమయంలో ఊరంతా కోలాహలంగా హోలీ సంబురాలు చేసుకున్నారు. సాయంత్రంపూట.. మొదటగా కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా.. గ్రామం నలుమూలల నుంచి పురుషులంతా హనుమాన్ మందిరం వద్దకు చేరుకున్నారు. అక్కడ కట్టిన తాడుకు ఇరువైపులా సామాజికవర్గాలుగా విడిపోయి పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. పది నిమిషాల పాటు కొట్టుకున్న తరువాత తాడు వదిలేయడంతో ఆట ముగిసింది. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని ఎక్కువ పిడిగుద్దులు కురిపించిన వారిని భుజాలపై ఎత్తుకుని తమ వాడలకు తీసుకెళ్లారు. గాయాలైన వారు కామదహనంలోని బూడిదను ఒంటికి పూసుకున్నారు.
ఇదీ చూడండి: